మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటుపై నెలకొన్న ప్రతిష్టంభనకు మరికొన్ని గంటల్లో తెరపడే అవకాశం కన్పిస్తోంది. సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు శివసేన రంగం సిద్ధం చేస్తోంది. ప్రభుత్వాన్ని ఏర్పాటుకు సేనకు ఎన్సీపీ-కాంగ్రెస్ మద్దతు తప్పనిసరి కావడంతో ఆ రెండు పార్టీలతో సేన అధిష్టానం చర్చలు జరుపుతోంది. ముఖ్యమంత్రి పదవిని శివసైనికుడే చేపడతాడని, సర్కారు ఏర్పాటుకు మద్దుతునిస్తున్న ఎన్సీపీ, కాంగ్రెస్‌లకు డిప్యూటీ సీఎం పదవులిస్తారని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ కూటమికి కాంగ్రెస్ పార్టీ బయటి నుంచి మద్దతు ఇవ్వనున్నట్లు కూడా వినిపిస్తోంది. ఈ మూడు పార్టీలు కూటమిగా ఏర్పడితే మ్యాజిక్ ఫిగర్‌ను అధిగమించి సంకీర్ణ సర్కారు కొలువుదీరనుంది
ఈ నేపథ్యంలోనే ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించి శివసేన అధినేత ఉద్ధవ్ ఠాక్రేతో ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ భేటీ అయ్యారు. మహా రాజకీయ పరిస్థితులు, కూటమిలో చేరికపై కాంగ్రెస్ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీ నివాసంలో సీడబ్ల్యూసీ సమావేశమైంది. భేటీకి సీనియర్ కాంగ్రెస్ నేతలు అహ్మద్ పటేల్, కేసీ వేణుగోపాల్, మల్లికార్జున ఖర్గే తదితరులు హాజరయ్యారు. శివసేనకు మద్దతుపై సీడబ్ల్యూసీ ఇంకా నిర్ణయం తీసుకోలేదని తెలుస్తోంది. మహారాష్ట్ర కాంగ్రెస్ సీనియర్ నేతలు ఢిల్లీ రావాలని ఆదేశించినట్లు సమాచారం. సాయంత్రం 4 గంటలకు సీడబ్ల్యూసీ మరోసారి సమావేశం కానుంది. మరోవైపు ఇవాళ సాయంత్రం శివసేన నేతలు గవర్నర్‌ను కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు అనుమతి కోరనున్నారు. ఎన్డీఏ నుంచి వైదొలిగితేనే ప్రభుత్వ ఏర్పాటుకు మద్దతునిస్తానని ఎన్సీపీ..శివసేనకు షరతు విధించింది. ఈ నేపథ్యంలో నరేంద్రమోదీ కేబినెట్‌లో ఉన్న శివసేన ఎంపీ అరవింద్ సావంత్ కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేశారు.
కనీస మెజారిటీ లేకపోవడంతో తాము ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేమని బీజేపీ స్పష్టం చేసిన సంగతి విదితమే. ఆపద్ధర్మ సీఎం ఫడ్నవీస్ నేతృత్వంలోని బీజేపీ ప్రతినిధి బృందం ఆదివారం గవర్నర్ భగత్‌సింగ్ కోశ్యారీని కలిసి తమ నిర్ణయాన్ని ఆయనకు వివరించింది. దీంతో రాష్ట్రంలో రెండో అతిపెద్ద పార్టీ అయిన శివసేనను ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సిందిగా గవర్నర్ ఆహ్వానించారు. తమ నిర్ణయాన్ని సోమవారం రాత్రి 7.30లోగా తెలుపాలని సూచించారు.